ఊట్కూర్, నవంబర్ 13 : నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో రెండు వర్గాలకు చెందిన శ్మశాన వాటికలు ఉన్న గ్రామ కంఠం స్థలాన్ని జేసీబీతో చదును చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూరులో మినీ స్టేడియం నిర్మాణంలో భాగంగా మంత్రి శ్రీహరి ఆదేశాల మేరకు గురువారం గ్రామకంఠం స్థలాన్ని చదును చేశారు. పిచ్చి మొక్కలు, పొదలను జేసీబీతో తొలగిస్తుండగా రెండు వర్గాలకు చెందిన శ్మశాన వాటికలు ధ్వంసమయ్యాయి. ఓ మతం నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకొని పనులను అడ్డుకున్నారు.
దాదాపు 200 ఏండ్లకుపైగా ఇక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయని, ఇక్కడ స్టేడియం ఎలా కడతారని అధికారులను నిలదీశారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. పనులు చేపట్టిన విషయం తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.