హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు 31 జడ్పీ, 565 జడ్పీటీసీ, 5,763 ఎంపీటీసీ, 12,760 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీచేసిన వెంటనే కలెక్టర్లు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్టు సమాచారం.
హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 565 మండల పరిషత్, 31 జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. ఆదివారం కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.