హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట దేవస్థానంలో ఓ ఉద్యోగిని రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ నుంచి డిప్యూటేషన్‌పై యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈవో)గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ నెలాఖరులో రిటైరవనున్నారు. ఆ తర్వాత కూడా ఆయనను ఉద్యోగంలో కొనసాగించాలంటూ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ప్రతిపాదనలు పంపినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
క్యాడర్ స్ట్రెంత్‌లో లేని పోస్ట్‌ను ఆ ఉద్యోగికి ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. దీని వల్ల అతని స్థానంలో పనిచేయాల్సిన అర్హులైన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవాదాయశాఖలో చాలా మంది ఉద్యోగులు ప్రమోషన్లు లేక ఆవేదన చెందుతున్నారని, ఇలాంటి తరుణంలో రిటైరయ్యేవారిని మళ్లీ ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకుని ఇతర ఉద్యోగులకు అన్యాయం చేయొద్దని, అర్హతలున్న ఉద్యోగులకు అవకాశం కల్పించాలని మేజర్ టెంపుల్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
దేవాదాయ శాఖలో ఉన్నతాధికారుల నిర్ణయాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. డిప్యూటేషన్ల ద్వారా వేరే శాఖల ఉద్యోగులను దేవాదాయ శాఖలోకి తీసుకోవాలన్న జీవోపై గతంలో ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. యాదగిరిగుట్టలో ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ఏఈవోను మళ్లీ అక్కడే కొనసాగించేందుకు అధికార పార్టీకి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. ఇటీవల ఆయన రెండుసార్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసి ఆ ఉద్యోగి విషయంలో తాను చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం.
దేవుడి ఆదాయంలో వాటా కోసమే ఆ ప్రజాప్రతినిధి సదరు ఉద్యోగిపై ప్రేమ చూపిస్తున్నాడని ఇతర ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రిటైరయ్యే ఉద్యోగి రక్తసంబంధీకుడు కూడా యాదగిరిగుట్ట ఆలయంలో కీలక పోస్టులో ఉన్నాడని, వారిద్దరూ స్థానిక ప్రజాప్రతినిధితో కుమ్మక్కై ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.