హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అప్పుడు గజ్వేల్ అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కిద్దామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎర్రవెల్లిలోని నివాసంలో శుక్రవారం గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం కేసీఆర్‌ను కలిసి పట్టణ సమస్యలపై వినతిపత్రం అందజేసింది. రెండున్నరేండ్లుగా పట్టణంలో కీలకమైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కోటమైసమ్మ-క్యాసారం రోడ్డు, రింగు రోడ్డు విస్తరణ, నిర్మాణాలు నిలిచిపోవడం వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు వివరించారు. పట్టణ సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకున్న కేసీఆర్.. ప్రజాప్రతినిధులకు ధైర్యం చెప్పారు.
సమస్యల పరిషారానికి కృషి చేయాలని సూచించారు. ‘గజ్వేల్ పట్టణ అభివృద్ధిని మునుపటిలాగే వేగవంతం చేసి తీరుతాం. ప్రజా సమస్యల పరిషారంలో పాలకవర్గం నిరంతరం ముందుండాలి’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కల్యాణర్ పద్మభాయ్ నర్సింగరావు, కౌన్సిలర్లు అంజిరెడ్డి, జుబైర్ పాషా పాల్గొన్నారు.