బల్మూరు, డిసెంబర్ 23 : ‘ఉమామహేశ్వర ప్రాజెక్టు మాకొద్దు’ అంటూ స్థానిక రైతులు అధికారులను అడ్డుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు శివారులో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేసేందుకు సోమవారం అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు మూకుమ్మడిగా అక్కడకి వచ్చి నిలదీశారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందే సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. భూములు కోల్పోతే తమకు నష్టం వస్తుందని వాపోయారు. ఇప్పటికే ఉమామహేశ్వర ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని కోర్టులో కేసులు వేశామని తెలిపారు. తమకు ఇబ్బందులు కలిగించకుండా అచ్చంపేట ఎమ్మెల్యే వెంటనే స్పందించి పనులు నిలిపివేయించాలని విజ్ఞప్తి చేశారు. అడ్డుకున్న విషయం తెలుసుకొన్న ఎస్సై రమాదేవి అక్కడికి వెళ్లి రైతులను సముదాయించారు.