హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో, బయట బీఆర్ఎస్ తరఫున పోరాడామని పేర్కొన్నారు. గవర్నర్ ద్వారా కేంద్రానికి బీసీ బిల్లు పంపినప్పటికీ దాన్ని బైపాస్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారని, కానీ గత అనుభవాల దృష్ట్యా ఆర్డినెన్స్‌పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏం చేస్తారో చేయండి కానీ, బీసీలకు మాత్రం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఆర్డినెన్స్‌ను తీసుకువస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు వ్యవహార శైలిపై పలు అనుమానాలు కలుగుతున్నాయని, ఇందులో ద్రోహంతో కూడిన కుట్ర కనిపిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు ద్రోహం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయస్థాయిలో ప్రతిపక్ష హో దాలో ఉన్నదని గుర్తుచేశారు. అయినప్పటికీ బీసీ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని విమర్శించారు. అన్నీ తెలిసి కూడా బీసీలకు ద్రోహంచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నట్టు చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ సర్కారు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించే వరకు వదలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పినప్పటికీ, ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలో ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టకుండా 70 శాతం రిజర్వేషన్ల ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ సర్కార్ ఘరానా మోసానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లులను గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపారని, ప్రస్తుతం అది కేంద్రం వద్ద ఉన్నదని, ఈ నేపథ్యంలో ఇప్పుడు దానిని కాదని, ఆర్డినెన్స్ తీసుకురావడమేమిటని సూటిగా ప్రశ్నించారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే జీవో జారీ చేస్తే అవి కోర్టుల్లో నిలబడలేదని గుర్తు చేశారు. ఒక వేళ జీవోలో ఇవ్వాలనుకుంటే అందుకోసం ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే అందుకు 20 నెలల సమయం ఎందుకు పట్టిందని నిలదీశారు. గత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా తమ అనుమానాలు వ్యక్తం చేసినట్టు గుర్తుచేశారు. ఈ బిల్లుపై ప్రధానమంత్రిని కలిశారా? అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారా? కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏం చేస్తారో చేయండి కానీ, బీసీలకు మాత్రం 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో బీసీల నోట్లో మట్టి కొట్టవద్దని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళంలో తీసుకురావాలని తాము ప్రయత్నించడం లేదని, కేవలం ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తి చూపుతున్నామని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై కేవలం 9 రోజుల్లో నివేదిక ఇస్తే ఎలా నిలుస్తుందని ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన బీసీ బిల్లులు కేంద్రంలోనే పెండింగ్‌లోనే ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ఎలా చెప్తున్నారని నిలదీశారు. సర్కారును విమర్శించాలన్నది తమ అభిమతం కాదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ కోరిక అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ సర్కార్‌కు బీసీలపైనా అంత ప్రేమే ఉంటే రీసర్వే చేసి, బీసీ బిల్లును చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లు అనేవి కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి సొంత వ్యవహారం కాదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ఈ బిల్లు విధానంలో న్యాయపరంగా అనేక లొసుగులు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీ విషయంలో సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణన తప్పుగా చేసి, బీసీల జనాభా తక్కువగా చూపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిషన్ విషయంలో సర్కారు సరైన విధానాన్ని అనుసరించలేదని ఆరోపించారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికపై క్యాబినెట్లో చర్చించలేదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి, చేతులు దులుపుకొని పోయే వ్యవహారంగా కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకువస్తున్న ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లును ఉపసంహరించుకుందా? అని అనుమానం వ్యక్తంచేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆర్డినెన్స్ తీసుకువస్తున్నామని సర్కారు చెప్తున్నప్పటికీ ఇది కోర్టులో నిలువదని సీఎం రేవంత్‌రెడ్డి కూడా తెలుసని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. బీసీల ఓట్లు దండుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని విమర్శించారు. చట్టబద్ధత లేకుండా ఆర్డినెన్స్‌లు ఇవ్వడం సరికాదన్నారు.