ఖైరతాబాద్, సెప్టెంబర్ 22 : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకాలో జరిగిన రౌండ్‌టేబుల్ సమవేశంలో ఆయన మాట్లాడారు. కులగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని చెప్పారు. మొక్కుబడిగా కులగణన చేస్తామంటే ఒప్పుకునేది లేదని, 42 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేమెంతో మాకంత అన్న నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అవుతారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర క్యాబినెట్లోనూ బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర నాయకులు లాల్‌కృష్ణ, వివిధ బీసీ సంఘాల నాయకులు వేముల వెంకటేశ్, గుజ్జ సత్యం, ఎర్ర సత్యనారాయణ, శ్రీనివాస్, జనార్దన్, జయంత్‌రావు, జగన్మోహన్, రామలు తదితరులు పాల్గొన్నారు.