హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను పక్కనపెట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 50 శాతం మించి రిజర్వేషన్ల అమలుకు కోర్టు అంగీకరించకపోవటంతో పాత పద్ధతి ప్రకారమే ముందుకెళ్లాలని అనుకుంటున్నట్టు తెలిసింది. 57వసారి శనివారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ పరమైన రిజర్వేషన్ల ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం ముందు పెట్టగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ తొలివారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేండ్లు పూర్తికానున్నాయి. ఈ రెండేండ్లలో తాము చేసిన పనులను ప్రజల ముందు పెట్టడానికి వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈలోపే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. కాబట్టి వేడుకలకు వీలుపడదని భావించి షెడ్యూల్ జారీని డిసెంబర్ రెండోవారానికి వాయిదా వేసినట్టు తెలిసింది. వేడుక పూర్తయిన రోజు, లేదా మరుసటి రోజు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయత్తం కావాలని ప్రభుత్వ పెద్దలు అధికారులకు సూచించినట్టు సమాచారం.
వేడుకల కోసం షెడ్యూల్ వాయిదా?
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోగా స్పష్టమైన నిర్ణయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆలోపే ఎన్నికల షెడ్యూల్ జారీకి సిద్ధమైనట్టుగా కోర్టుకు చెప్పాలని రేవంత్ సర్కారు తొలుత భావించింది. ఆ మేరకు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నోట్‌ఫైల్ తయారుచేయాలని ఇటీవల పంచాయతీ రాజ్‌శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిదని నోట్‌ఫైల్‌ను పీఆర్ఆర్డీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి, తాము ఎన్నికలు జరిపేందుకు సిద్ధమేనని హైకోర్టుకు తమ నిర్ణయాన్ని తెలపాలని ప్రభుత్వం భావించింది. ఒకానొక సందర్భంలో 24లోగా షెడ్యూల్ కూడా జారీ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావించినట్టు సమాచారం. ఈ లోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. రెండేండ్ల పాలన వేడుకలను జరుపాలకున్న తరుణంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే కోడ్ కారణంగా వేడుకలకు వీలు ఉండదు కాబట్టి షెడ్యూల్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు తెలిసింది.
కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం తూట్లు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా, ముందుకు వెళ్లండని చెప్పినట్టు సమాచారం. అయితే, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ కూడా చేసింది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నది. పాత పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని భావిస్తున్నది. కాంగ్రెస్ నిర్ణయంపై బీసీ జేఏసీ భగ్గుమంటున్నది.
రేపు క్యాబినెట్ భేటీ
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానున్నది. ఈ మేరకుక సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చ జరగనున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురుకావడంతో తదుపరి ఏం చేయాలనే అంశంపై క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.