CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంకు నుంచి సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి అవసరమైన నిధులను తక్కువ వడ్డీతో సమకూర్చుకుంటున్నటు చె ప్పారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల్లో విశిష్ఠ సేవలందించిన పలువురు అధికారులకు పురస్కారాలు అందజేశా రు. అంతకుముందు సీఎం తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ చేరుకుని అమర జవాన్లకు నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరు గా గోల్కొండ కోటకు చేరుకుని జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఈ ఏడాది నుంచే రాష్ట్రం లోని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. రైతు భరో సా పథకం కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని చెప్పారు. పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ ఏడాది నుంచి ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించినట్టు తెలిపారు. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.
పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సలహా లు, సూచనలు స్వీకరించే సౌలభ్యం కల్పించినట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండొచ్చని, తమ నిర్ణయాల్లో తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒకరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీచేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రూ.500కే వంట గ్యాస్ పథకం వల్ల 43 లక్షలమంది, గృహజ్యోతి పథకం వల్ల 47.13లక్షల మంది లబ్ధిపొందుతున్నట్టు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ. 31 వేల కోట్లు వెచ్చించి రైతును రుణ విముక్తుడిని చేస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ సూళ్ల ను నిర్మించబోతున్నట్టు చెప్పారు. విదేశీ పర్యటనకు వెళ్లి ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను వారికి పరిచయం చేశామని, 40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు.
గోల్కొండ కోటలో సీఎం హోదాలో తొలిసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి పలుమార్లు తన ప్రసంగంలో తడబడ్డారు. దాదాపు 30నిమిషాలపాటు ప్రసంగించిన ఆయన కొన్ని పదాలను సరిగ్గా పలుకలేకపోయారు. 20కిపైగా పదాలను పలకడంలో తప్పులు దొ ర్లాయి. మరికొన్ని పదాలను చదువుతూ తడబడి ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. కొన్నిచోట్ల అంకెలను తప్పుగా చెప్పారు.
గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే పలువురు లేచి బయటకు వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు దారికి అడ్డంగా కుర్చీలు పెట్టి వెళ్లి కూర్చోవాలని సూచించారు. వేడుకలను ప్రజలు వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్యాలరీల నుంచి కూడా ప్రజలు లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
‘మన రాష్ట్రంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరామ్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను నెహ్రూ ప్రారంభిస్త్తే తర్వాత వాటిని పూర్తిచేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాలు పారించిన గొప్ప చరిత్ర ఇందిరాగాంధీకి దక్కుతుంది’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూ ర్ జిల్లాలోని భాక్రా గ్రామంలో సట్లెజ్ నదిపై భాక్రానంగల్ డ్యామ్ నిర్మించారు. వర్షపు నీటి నిల్వతోపాటు హర్యానా, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్టాలకు సాగునీరు అందిస్తుంది. ఉత్తర భారతంలో ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది రాష్ట్రంలోనే ఉన్నట్టు చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.