Runa Mafi | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తున్నామని, అందుకోసం రూ.33 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ నెల 9న హైదరాబాద్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలీ సంఘం మహాసభలో పాల్గొన్న ఆయన, ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యకాలంలో రుణం పొందిన వారికి మాత్రమే మాఫీ జరిగినట్టు జీవోలో పేర్కొన్నారు. దీంతో చేనేత, పవర్లూమ్ కార్మికుల్లో కలవరం మొదలైంది. రూ.లక్షలోపు వారికి మాత్రమే రుణమాఫీ చేస్తే, లక్ష దాటిన వారి పరిస్థితి ఏమిటని సర్కారును నిలదీస్తున్నారు. రూ.లక్షకు ఒక్క రూపాయి ఎక్కువైనా రుణమాఫీ చేయడం లేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకర్లు కూడా ఇదే విషయం చెబుతున్నట్టు పేర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 వేల మందికిపైగా చేనేత కార్మికులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగా, అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలపాటు ఆలస్యం చేసింది. దీంతో బ్యాంకుల ఒత్తిడికి కొంతమంది చేనేత కార్మికులు తలొగ్గి బయట అప్పులు చేసి రుణాలు తీర్చారు. ఇక మిగిలిన వారికి మాత్రమే ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తున్నట్టు చెబుతుండడంతో రుణాలు చెల్లించిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు రుణమాఫీ బ్యాంకుల నుంచి పొందిన అసలుకా? వడ్డీతో కలిపి మొత్తానికి చేస్తారా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంటున్నారు. రుణమాఫీకి సంబంధించిన అంశాలపై క్లారిటీ ఇవ్వాలని, అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు చెరుకు స్వామి, పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు కూరపాటి రమేశ్ డిమాండ్ చేస్తున్నారు.