Runa Mafi | సిద్దిపేట/సిద్దిపేట రూరల్, జూలై 26 : లక్షలోపు పంట రుణమాఫీ రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తయిందని, అందుకు నిధులు ఆయా బ్యాంకులకు జమ చేశామంటూ జాబితాను ప్రభుత్వం హడావిడిగా ప్రకటించింది. తీరా రైతులు బ్యాంకులకు వెళ్లి రుణ ఖాతాలను తనిఖీ చేసుకుంటే మాఫీ కాలేదని తేలడంతో వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌కు చెందిన దగ్గుల రాజు అనే రైతు ఎస్బీఐలో రూ.63,800 పంట రుణం తీసుకున్నాడు. మొదటి విడత లక్ష లోపు రుణం మాఫీ అయినట్టు తెలుసుకొని బ్యాంకుకు వెళ్లగా కాలేదని తెలుసుకుని కంగుతిన్నాడు. పంట రుణాన్ని బ్యాంకు నిబంధనల మేరకు రెన్యువల్ కూడా చేయించానని, అయినా రుణం మాఫీ కాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రాఘవాపూర్ రైతు సమస్యను ‘నమస్తే తెలంగాణ’ వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మరో జాబితాలో మా ఫీ చేయిస్తామని చెప్పారు. ఈ జాబితాలో ఎం దుకు కాలేదనే విషయం చెప్పలేకపోయారు.
నాకు రాఘవాపూర్‌లో ఎకరం నాలుగు గుంటల పొలం ఉన్నది. 2013లో నర్సాపూర్ చౌరస్తాలోని ఎస్బీఐలో క్రాప్ లోన్ తీసుకు న్న. అప్పటి నుంచి మిత్తి కట్టి రెన్యువల్ చేసుకుంటున్న. 10 మే 2023న రెన్యువల్ చేసుకున్న. లోన్ మొత్తం 63,800 అయింది. ప్రభుత్వం లక్షలోపు లోన్ ఉన్న వారికి క్రాప్ లోన్ మాఫీ చేసిందని తెలిసి బ్యాంకుకు పోయిన. లిస్టులో నాపేరు లేదట. లక్షలోపు లోన్ ఉన్నోళ్లకు మాఫీ చేస్తే నా అప్పు మాఫీ కావాలె. కేసీఆర్ గవర్నమెంట్ల పోయినసారి రూ.30 వేలు మాఫీ అయింది. ప్రతి పంటకు మాకు రైతుబంధు వేసిండు. కాంగ్రెస్ ప్రభు త్వం నాకు రుణమాఫీ చేసి ఆదుకోవాలి
-దగ్గుల రాజు, రాఘవాపూర్, సిద్దిపేట జిల్లా
శంకరపట్నం, జూలై 26: ‘సార్.. సర్కారే మో ఓ దిక్కు రైతులకు రూ.లక్ష పంట రుణా లు మాఫీ చేశామని చెబుతున్నది.. మీరేమో లిస్ట్‌లో పేర్లు రాలేదని అంటున్నరు.. మేమేం పాపం చేశాం సార్’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామ రై తులు ఆక్రోశం వెల్లగక్కారు. శుక్రవారం సు మారు 40 మంది రైతులు మొలంగూర్‌లోని ఇండియన్ బ్యాంక్‌కు చేరుకొని మేనేజర్‌ను నిలదీశారు. తమ గ్రామంలో ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేదని, ఇందుకు కారణమేందంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మేనేజర్ శ్రావణ్ పంట రుణమాఫీ జాబితాతో త మకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పై అధికారులు తమకు జాబితా పంపించారని తెలిపారు. అనంతరం జేడీఏ శ్రీనివాస్‌కు ఫో న్ చేసి రైతులతో మాట్లాడించారు. వచ్చే సో మవారం నుంచి ఖాతాల్లో జమయ్యేలా చర్య లు తీసుకుంటామని జేడీఏ హామీ ఇచ్చారు.
నార్నూర్, జూలై 26 : ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలోగల గిరిజనేతర రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరని జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తే తప్పేంటని నిలదీశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద గిరిజనేతర రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. గిరిజనేతర రైతులకు రుణమాఫీ వర్తింపజేయకపోవడం శోచనీయమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం షరతులు లేకుండా ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గిరిజనేతర రైతులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనేతర రైతులకు అన్యాయం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి గిరిజనేతర రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, తహసీల్దార్ జాడి రాజలింగానికి వినతిపత్రం సమర్పించారు.
చిల్పూరు, జూలై 26: రుణమాఫీ తీరుపై జనగామ జిల్లా చిల్పూరు మండల రైతులు క న్నెర్ర చేశారు. మండలంలోని 8 గ్రామాలకు చెందిన 3,625 మంది రైతులు రుణాలు తీ సుకోగా, ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదం టూ శుక్రవారం మల్కాపూర్‌లోని ఇండియన్ బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. విషయం తె లుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అక్కడి కి వచ్చిన బ్యాంకు అధికారులతో మాట్లాడా రు. హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్ అధికారితో ఫోన్లో మాట్లాడగా.. రెండో విడతలో రుణాలు మాఫీ అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు.