Runa Mafi | హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): చక్రధర్ అనే రైతు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆయనకు ఓ అన్న ఉండగా పెళ్లి కావడంతో వేరుగా ఉంటున్నాడు. చక్రధర్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయనకు రూ.1.57లక్షల పంట రుణం ఉంది. ప్రభుత్వం చేసిన రుణమాఫీలో ఆయనకున్న రుణం మాఫీ కాలేదు. ఇప్పుడు వెళితే కుటుంబసభ్యులెవరైనా ఉంటేనే కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఒంటరి వాళ్లకు చేసేందుకు ఆప్షన్ లేదని ఏఈవో చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక తనకు ఇక రుణమాఫీ కాదనే ఆందోళనను రైతు చక్రధర్ వ్యక్తం చేస్తున్నాడు. ఈ విధంగా రాష్ట్రంలో చాలామంది ఒంటరి మహిళలు, పురుషులు రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఒంటరి వ్యక్తులను, ఇతర దేశాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన వారిని రుణమాఫీకి దూరం చేస్తున్నది. రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణలో భాగంగా వీరిని గుర్తించే ఆప్షన్ ఇవ్వలేదు. భార్యనో, భర్తనో, తల్లిదండ్రులో, అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ఉంటేనే కుటుంబ నిర్ధారణ చేస్తున్నారు. ఎవరూ లేని వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఒకవేళ వీళ్ల పేర్లు నమోదు చేయాలంటే కుటుంబ సభ్యులను చూపించాలని కొర్రీలు పెడుతున్నారు. దీంతో భర్త చనిపోయిన వాళ్లు, విడాకులు తీసుకున్నవాళ్లు, పెళ్లి చేసుకోనివాళ్లు, తల్లిదండ్రులు లేని వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు బతుకుదెరువు కోసం విదేశాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లిన వారికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కుటుంబ నిర్ధారణ సమయంలో వాళ్లు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో వాళ్లను విస్మరిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం వాళ్లు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ల పేర్లు నమోదు చేయడం లేదని తెలిసింది. రుణమాఫీ ప్రక్రియలో ప్రభుత్వం ఒంటరిగా జీవిస్తున్న వారిని అర్హులుగా గుర్తించేందుకు అవసరమైన విధానమే లేకపోవడం గమనార్హం. ఏఈవోలు రైతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ పెద్ద నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఎవరూ లేని వాళ్లకు సంబంధించి పేర్లు నమోదు చేసేందుకు, వాళ్లు రుణమాఫీకి అర్హులు కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఒంటరి వాళ్లు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి రుణమాఫీలో తమ పేర్ల నమోదుకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.