హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలను ఇంటి నుంచే తిరిగి చెల్లించేందుకు స్త్రీనిధి సంస్థ అవకాశం కల్పించింది. బీబీపీఎస్ (భారత్ బిల్ పే సిస్టమ్) ద్వారా ఫోన్‌పే, గూగుల్‌పే (జీపే), పేటీఎంలో ఎక్కడి నుంచైనా నిమిషాల్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు గత నెల నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత పద్ధతుల్లో ఎస్‌హెచ్‌జీ సభ్యులు నేరుగా బ్యాంకులకు వెళ్లి చెల్లింపులు చేసేవారు. ఇది ఖర్చుతో కూడిన పనికావడంతో చాలా మంది ఆసక్తి చూపడంలేదు. పైగా ఎస్‌హెచ్‌జీ లీడర్లు తప్పనిసరిగా బ్యాంకుకు వచ్చి తీర్మానం కాపీని సమర్పించాల్సి రావడంతో సమయం వృథా అయ్యేది. ఈ సమస్యలన్నింటికీ చెక్‌పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న బీబీపీఎస్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వీలుకల్పించింది. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, త్వరలో అధికారికంగా ప్రారంభిస్తామని స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు.
ప్రయోజనాలు ఇవీ..
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి 120 పద్ధతుల్లో రుణాలను తిరిగి చెల్లించవచ్చు. తద్వారా స్త్రీనిధి రుణ రికవరీలు మెరుగవుతాయి.
గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న కిరణాషాపులు, మొబైల్ షాపుల నుంచి బీబీపీఎస్ ద్వారా రీపేమెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ పద్ధతుల్లో చేసే చెల్లింపులు సంబంధిత ఎస్‌హెచ్‌జీ సభ్యుల రుణ ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి.
లావాదేవీలు 100% పారదర్శకంగా, అత్యంత కచ్చితంగా జరుగుతాయి.
ఎలా చెల్లించాలంటే..
గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ ఆధారిత యాప్‌లలో దేన్నైనా ఓపెన్ చేయాలి.
లోన్ రీపేమెంట్/బిల్లర్ లిస్ట్ నుంచి స్త్రీనిధిని ఎంచుకోవాలి.
ఎస్‌హెచ్‌జీ ఐడీని ఎంటర్ చేసి, చెల్లించాల్సిన మొత్తాన్ని పొందుపర్చాలి.
సొంతంగా బ్యాంక్ యూపీఐ లేని సభ్యులు కిరాణాషాపు లేదా మొబైల్ షాపు యజమానుల యూపీఐ పిన్ నుంచి చెల్లింపులు చేసి, ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
ఎస్‌హెచ్‌జీ సభ్యురాలి ఐడీ వివరాలను 79970 07189 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.