Heavy Rains | హనుమకొండ రస్తా : భారీ వర్షాల కారణంగా అక్టోబర్ 30న (గురువారం) జరగాల్సిన ఎల్ఎల్బీ (మూడు సంవత్సరాల) నాలుగో సెమిస్టర్, ఎల్ఎల్బీ (ఐదేళ్ల) ఎనిమిదో సెమిస్టర్, బీటెక్ మొదటి సంవత్సరం (మొదటి సెమిస్టర్) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, మిగిలిన అన్ని పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీలకు 30న(గురువారం) సెలవు ప్రకటిస్తున్న జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జి.గోపాల్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, అధ్యాపకులకు వెంటనే సమాచారం అందించాలని, కాలేజీ ప్రాంగణం భద్రతను నిర్దారించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితినిబట్టి మరిన్ని నవీకరణలు చేయనున్నట్లు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో 30, 31 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరగాల్సిన అంతర్ కాలేజీల అథ్లెటిక్స్ మీట్ మహిళలు, పురుషుల పోటీలను భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు. ఈ పోటీలను వర్షాలు తగ్గాక నవంబర్ నెలలో జరుపుతామని ఆయన పేర్కొన్నారు.