హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సులు జాబ్ గ్యారెంటీ కోర్సులు. ఈ కోర్సు పూర్తిచేయగానే 20కి పైగా సంస్థల్లో కొలువులు స్వాగతం పలుకుతాయి. జూనియర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు ఆహ్వానం పలుకుతాయి. ప్రైవేట్ రంగంలోనూ పుష్కలంగా అవకాశాలుంటాయి. కొలువొద్దు అనుకుంటే ఉన్నత చదువుల కోసం ఈసెట్ ద్వారా బీటెక్ సెకండియర్‌లో ఎంట్రీ పొందవచ్చు. ఇంతటి చక్కటి అవకాశాలు ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల సొంతం.
కానీ డిప్లొమా కోర్సులకు డిమాండ్ తగ్గుతున్నది. విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడంలేదు. నాలుగేండ్లుగా అడ్మిషన్లు తగ్గుతు న్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోనూ భారీగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఏడాది ఏకంగా 11వేలకు పైగా సీట్లు మిగిలాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం. ఈ సారి డిప్లొమా ఫస్టియర్‌లో 29వేలకు పైగా సీట్లుంటే, 18వేలకు పైగా సీట్లు మాత్రమే నిండాయి. 11వేలకు పైగా సీట్లు మిగలడంతో సాంకేతిక విద్యాశాఖ అధికారుల్లో కలవరం మొదలయ్యింది. యాజమాన్యాలవారీగా తీసుకుంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 77.98%, ప్రైవేట్‌లో 47.1% సీట్లు నిండాయి.
పాలిసెట్ తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఈ సారి 115 కాలేజీలకు కేవలం 6 కాలేజీల్లో మాత్రమే వందకు వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో ఐదు ప్రభుత్వ కాలేజీలుండగా, ఒక ప్రైవేట్ కాలేజీ ఉంది. పాలిటెక్నిక్‌లో చేరేవారే కాకుండా ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తు చేసే వారి సంఖ్య ఏటా తగ్గుతున్నది. గతంలో లక్ష మందికి పైగా విద్యార్థులు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న దాఖలాలున్నాయి. మూడేండ్లుగా దరఖాస్తు చేసే వారి సంఖ్య కూడా తగ్గుతున్నది.