హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్ బాస్ పదవి కోసం సీనియర్ ఐపీఎస్‌ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నది. డీజీపీ పోస్టు కోసం ఇటు సీనియర్లు, అటు జూనియర్లు ఎవరికివారే పైరవీలు చేసుకుంటూ పోటీ పడుతున్నారు. జూనియర్లకు ప్రభుత్వ పెద్దలే అండగా నిలువడంతో.. నియమ నిబంధనలు పాటించాల్సిందేనని సీనియ ర్లు పట్టుబడుతున్నట్టు తెలిసింది. దీంతో చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగించినట్టే డీజీపీ పదవీ కాలాన్ని కూడా పొడిగిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొత్త డీజీపీ పదవికి రేసులో సీనియార్టీ ప్రకారం 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు ముందు వరుసలో ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్ డిసెంబర్లో రిటైర్ అవుతుండటంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారికి అవకాశం దకాలి. అయితే, ఈ పోస్టు కోసం 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు ఐదుగురు సీనియార్టీ లీస్ట్‌లో ఉన్నారు. వీరిలో యూపీఎస్సీ ర్యాంక్‌ల ప్రకారం చూస్తే ఇప్పటికే కేంద్ర సర్వీసులో ఉన్న అధికారి మొదటి స్థానంలో ఉండగా, నేరస్తులను సంస్కరించే విభాగానికి డీజీగా ఉన్న మరో ఐపీఎస్ రెండో స్థానంలో ఉన్నారు. ప్రభుత్వానికి ఎంతో కీలకమైన విభాగానికి అధిపతిగా ఉన్న ఐపీఎస్ మూడో స్థానంలో ఉన్నారు. నిబంధనల ప్రకారం 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారికి డీజీపీ హోదా దక్కాలి. కానీ, 1994 బ్యాచ్‌కు చెందిన వారిలో, సీనియార్టీలోనూ వెనుక ఉన్న ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఇప్పటికే రెండుసార్లు యూపీఎస్సీకి ప్రభుత్వం అర్హులతో కూడిన లిస్టు పంపింది. ఓ సీనియర్ అధికారిపేరు చేర్చకపోవడం ఒకసారి.. తప్పులు తడకగా పంపడంతో మరోసారి లిస్టు వెనక్కి వచ్చింది. పోలీసుశాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులే ఇలా లిస్టు రిజెక్ట్ అయ్యేలా పంపడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ముచ్చటగా మూడోసారి అర్హుల జాబితాను యూపీఎస్సీకి పంపినట్టు తెలిసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి డీజీపీగా కాకుండా ఇన్చార్జి డీజీపీగా నియమించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారనే వాదన వినిపిస్తున్నది. మొదట ఇన్చార్జీ డీజీపీగా ఇప్పించి, ఆ తరవాత అదే పేరును పూర్తిస్థాయి డీజీపీగా ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.