హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తిష్టవేసిన ఆంధ్రా సిండికేట్ కోసమే మద్యం టెండర్ల గడువును పొడిగించారని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస్తున్నా ఇంకా ఆంధ్రా వ్యాపారుల పెత్తనం వైన్‌షాప్ టెండర్లలో కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు నాంపల్లి ఆబ్కారీ భవన్‌లోని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఆంధ్రా సిండికేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా వ్యాపారాలు చేస్తూ.. తెలంగాణ వ్యాపారుల పొట్టగొడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆంధ్రా వ్యాపారుల కోసమే టెండర్ల గడుపును ఎక్సైజ్‌శాఖ అధికారులు పెంచినట్టు అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ వ్యాపారులు ఆంధ్రాలో టెండర్లు వేస్తే.. అకడి వ్యాపారులు అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని ఆంధ్రా వ్యాపారులకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.