హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కారు మరోసారి మద్యం ధరలు పెంచింది. చీప్ లికర్ బ్రాండ్, బీరు మినహా మిగిలిన అన్ని క్యాటగిరీల్లో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్లమీద 9.9 శాతం ప్రత్యేక ఎక్సైజ్ సెస్‌ను విధించింది. అయితే ఇప్పటివరకు ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ సర్యులర్ గాని, ఉత్తర్వుల కాపీని గాని విడుదల చేయలేదు. అధికారిక పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టలేదు. కానీ ఆదివారం సాయంత్రం తెలంగాణ బ్రూవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) తన అధికారిక ‘టీజీ లికర్ ప్రైస్ యాప్”లో ధరల పెరుగుదలను అప్డేట్ చేసింది. ఆ మేరకు క్వార్టర్ బాటిల్‌పై రూ.10, ఆఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు పెంచింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మద్యం మారెట్లోకి అనుమతించిన 2,760 రకాల బ్రాండ్లకు ఇదే ధర వర్తిస్తుందనే ప్రచారం జరుగుతున్నది. పెంచిన ధరలతో ఏడాదికి రూ. 2500 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుందని టీజీబీసీఎల్ అంచనా వేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లికర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. 15 శాతంగా లెకిస్తే ఒక బీరు ధర రూ.150 ఉంటే వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో కలిపి ఎమ్మార్పీ రూ.180కి పెరిగింది. తాజాగా లికర్ ధరలను సర్కారు పెంచింది. మద్యం సరఫరా కోసం లికర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనుంది. జూలై 1నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానున్నది. ఈ లోపే మద్యం ధరలు పెంచి డిస్టిలరీలు, డిస్టిబ్యూటర్లు, సరఫరా కంపెనీలతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
చీప్ లికర్పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచాలనే ఆలోచన చేయగా ఎక్సైజ్ కమిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. పొరుగు రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణలో చీప్ లికర్ ధర అధికంగా ఉన్నదని, ఇంకా ధరలు పెంచితే చీప్ లికర్ వ్యాపారం కుప్పకూలుతుందని హెచ్చరించినట్టు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని పొరుగు రాష్ర్టాల నుంచి ఎన్డీపీఎల్ మద్యం, ఫేక్ లికర్ అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి వివరించినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం వెనకి తగ్గినట్టు సమాచారం. కాగా సోషల్ మీడియాలో చెకర్లు కొడుతున్న ధరల పట్టికపై ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్‌ను సంప్రదించగా అది నకిలీది కావచ్చని దాటవేయడం గమనార్హం.