హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తుండటం ఇందుకు కారణం. దీంతో ఎక్సైజ్‌శాఖ ఈ ఏడాది అనుకున్న రూ.45 వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకునేట్టు కనిపిస్తున్నది. ‘రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది. రాష్ర్టాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారుచేస్తున్నది’ అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారం చేసింది.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రాష్ట్రంలో 60 వేలకుపైగా బెల్ట్‌షాపులు ఉన్నాయని, వాటిని తొలగిస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా వాటిపై కనీస చర్యలు లేవు. సీఎం స్థాయిలో ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్‌శాఖపై రివ్యూ చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపైనే ఆధారపడిందనే విమర్శలొస్తున్నాయి. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎక్సైజ్శాఖనే నమ్ముకున్నది. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత అ త్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్‌శాఖను గుర్తించింది. మద్యం అమ్మకాల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతినెలా దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది రూ.3,420 కోట్లకు చేరింది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.23 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రూ.45 వేల కోట్ల ఆదాయం ఇట్టే వచ్చేట్టు కనిపిస్తున్నది. అంటే ఆ స్థాయిలో మద్యం అమ్మకాలు పెంచారని సమాచారం. ఎక్సైజ్‌శాఖ నుంచి 2022లో రూ.32 వేల కోట్లు, 2023లో రూ.34 వేల కోట్లు ఆదాయం వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకు న్న లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు డిమాండ్‌కు మించి మద్యం, కొన్ని ప్ర ముఖ బ్రాండ్ మినహాయించి బీర్లను సైప్లె చేసినట్టు తెలిసింది. గత మూడు, నాలుగు నెలల్లో నే 90 లక్షల కేసుల లిక్కర్, 138.56 లక్షల కేసుల బీర్లను విక్రయించారంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో తెలిసిపోతుంది. ఒక్క ఏప్రిల్‌లోనే రూ.902.28 కోట్ల బీర్లు అమ్మా రు. 2023 ఏప్రిల్‌లో ఈ అమ్మింది రూ.764 కోట్లు మాత్రమే. గత ఏడాది కంటే ఈసారి 19 శాతం బీర్ల అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక్క ఏప్రిల్ నెలకు 2.28 లక్షల కేసుల బీర్లను నిల్వఉంచారు.
జనవరి నుంచి ఏప్రిల్ నాటికే 50.14 లక్షల కేసుల బీర్లను అమ్మారు. దీన్ని బట్టి మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. గత ప్రభుత్వం క్రమపద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టినా ‘తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారు’ అంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడెందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నాడు బెల్ట్‌షాపులు, మద్యం అమ్మకాలపై గగ్గోలు పెట్టిన ఒక వర్గం మీడియా ఇప్పుడు స్పందించకపోవటం గమనార్హం.