Excise Revenue | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని తన ఖజానాలో వేసుకుంటు న్న ప్రభుత్వం.. మద్యం సరఫరా చేసే దేశ, విదేశీ కంపెనీలకు మాత్రం డబ్బులివ్వడం లేదు. దీంతో కంపెనీల యజమానులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. డబ్బు లు అడిగిన ప్రతిసారి గత ప్రభుత్వం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని, పెరిగిన అమ్మకాలు, వాటి లాభాలను డీడీ కట్టి తెచ్చుకున్న తమకు ఇవ్వడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ నుంచి రూ.3,100 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నదని అంటున్నారు. తెలంగాణకు మద్యం సరఫరా చేస్తున్న దేశ, విదేశీ కంపెనీలు 52 వరకు ఉండగా.. వాటికి ప్రభుత్వం రూ.వేల కోట్లు బాకీ పడిందని యజమానులు చెబుతున్నారు. తెలంగాణలో 6 బ్రూవరీలు, 9 ఇండియా మేడ్ మద్యం కంపెనీలుండగా.. మిగిలినవన్నీ విదేశాలు, ఇతర రాష్ర్టాలవే ఉన్నాయి.
ప్రభుత్వానికి మద్యం కంపెనీల లేఖ..
ప్రభుత్వం నుంచి తమకు రావల్సిన రూ.3,100 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరుతూ భారత మద్యం తయారీ కంపెనీల సమాఖ్య డైరెక్టర్ జనరల్ అనంత్ ఎస్ అయ్యర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. గత నెల 14న ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంతో పోల్చితే ముడిసరుకు ధరలు పెరిగినందున మద్యం తయారీ కష్టంగా మారుతున్నదని తెలిపారు. ఇటీవల బీర్ల ధరల పెంపునకు అనుమతించిన విధంగానే మద్యం ధరల పెంపునకూ అనుమతివ్వాలని కోరారు.
ప్రస్తుతం రూ.2వేల కోట్లయినా చెల్లించాలని, లేకపోతే తయారీ, సరఫరా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అవి కూడా అందజేయని పక్షంలో సరఫరా నిలిపివేస్తామని పరోక్షంగా హెచ్చరించినట్టు తెలిసింది. కొనుగోలు చేసిన మద్యానికి 45 రోజుల్లోగా ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గతంలో ప్రతినెలా ఎంతోకొంత చెల్లింపులు జరిపిన ఎక్సైజ్‌శాఖ.. ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎక్కడి బకాయిలను అక్కడే వదిలేసినట్టు తెలిసింది.
చెలింపులకు డబ్బుల్లేని వైనం..?
రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, రవాణాశాఖల నుంచి వచ్చే సొమ్మును నిత్యం తన ఖజానాలో వేసుకుంటున్న ప్రభుత్వం.. ఆ సొమ్మును సంక్షేమ పథకాల వైపు మళ్లిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదని స్వయంగా సీఎం, మంత్రులు చెప్తున్నారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌శాఖ నుంచి వచ్చే డబ్బుపైనే ప్రభుత్వం ఆధారపడినట్టు తెలుస్తున్నది. మరింత ఆదాయం కోసం ఇప్పటికే బీర్ల ధరల పెంపు.. లిక్కర్ ధరనుపెంచే ఆలోచనలు చేయడం, కొత్తగా బార్లకు అనుమతులు ఇవ్వడం వంటి ప్రయత్నాలు చేస్తున్నది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నారని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు కిక్కురమనకుండా మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారని రాజకీయ విమర్శకులు అంటున్నారు.