ఆర్బీఐ రెపోరేటును మళ్లీ పెంచింది.ఫలితంగా గృహ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులూ మరోమారు పెంచేస్తున్నాయి.దీంతో రుణగ్రహీతలపై భారం ఇంకా పెరుగుతున్నది. ఇప్పటికే బరువెక్కిన రుణంతో సతమతమవుతున్నవారికి ఇది కష్టకాలమే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేటును పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు పేరుతో ఇప్పటికే రెపోరేటుకు 90 బేసిస్ పాయింట్లు జోడించిన సెంట్రల్ బ్యాంక్.. ఇటీవల దానికి మరో 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) వడ్డించింది. దీంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలన్నీ రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. ఇక ఆర్బీఐ ప్రకటనకు నాలుగు రోజుల ముందే గృహ రుణాలపై వడ్డీరేటును హెచ్డీఎఫ్సీ 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఫలితంగా గృహ రుణగ్రహీతలపై భారం మరింత పెరిగినైట్టెంది. ఇంతకీ ఈ పెంపు ప్రభావం మనపై ఎంత ఉండబోతోంది?.. ఇప్పుడేం చేయాలి?.. ఈ భారాన్ని తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందా?.. అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
ఈ టేబుళ్లను జాగ్రత్తగా గమనిస్తే మనం ఎంతటి భారాన్ని మోస్తున్నామో.. మోయాల్సి వస్తోందో అర్థమవుతుంది. రూ.50 లక్షల రుణాన్ని 20 ఏండ్ల కాలపరిమితికి లెక్కించాం.ఈ టేబుళ్ల ప్రకారం చూస్తే.. 7 శాతం వడ్డీరేటున్నప్పుడు నెలనెలా రూ.38,765 చెల్లించాల్సి వచ్చేది. 8 శాతానికి పెరగడంతో రూ.41,822 చెల్లిస్తున్నాం. అంటే ఈఎంఐ భారం రూ.3వేలపైనే పెరిగింది. వడ్డీరేటు మరో అర శాతం పెరిగి 8.5 శాతానికి చేరడం వల్ల ఈఎంఐ ఇంకో రూ.1,570 వరకూ పెరుగుతుంది. రూ.43,391కి చేరుతుందన్నమాట. రుణ కాలపరిమితి 20 ఏండ్లు కాబట్టి వడ్డీ భారం రూ.43.03 లక్షల నుంచి రూ.54.13 లక్షలకు చేరుతున్నది. 7 శాతం వడ్డీరేటుతో పోల్చితే 8.5 శాతం వడ్డీరేటుకు మనపై పెరుగుతున్న భారం రూ.11 లక్షలు. మున్ముందు వడ్డీరేట్లు పెరిగితే ఈ భారం కూడా పెరుగుతుంది. వడ్డీరేటు దాదాపు 1.5 శాతం పెరిగితేనే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఆర్బీఐ చెప్పినట్టు ఇంకా పెరిగితే గృహ రుణాలను భరించడం కష్టమే.
రుణ భారం తగ్గేదెలా
కరోనా పరిస్థితుల దృష్ట్యా తగ్గిన వడ్డీరేట్లు మళ్లీ పెరుగుతూపోతున్నాయి. నిజానికి ప్రపంచ బ్యాంకులన్నీ ఇప్పుడిదే బాటలో నడుస్తున్నాయి. అదుపు తప్పిన ద్రవ్యోల్బణమే కారణం. వడ్డీరేట్ల పెంపు ఇక్కడితో ఆగక ఇకపైనా కొనసాగే అవకాశమే ఉన్నది. అందుకే సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. ముఖ్యంగా అనుకోకుండా నగదు చేతికందితే వీలైనంత వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడమే మంచిది. బోనస్‌లను దీనికోసం వినియోగించండి.
మీ రుణంపై వడ్డీ ఎక్కువనిపిస్తే.. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకులకు రుణాన్ని బదిలీ చేసుకోండి. ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ చార్జీలతోపాటు అర శాతానికిపైగా వడ్డీరేటు తక్కువగా ఉంటేనే లోన్ ట్రాన్స్‌ఫర్‌కు వెళ్లండి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉన్నది.