హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయడానికి ఆధార్‌ను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ అనుసంధానం చేసుకొన్న కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి అందే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రమాదానికి గురై మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.6 లక్షలు, పూర్తిగా అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, కొద్దిగా అంగవైకల్యం పొందితే రూ.4 లక్షల వరకు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, సహజ మరణానికి రూ.లక్ష, అంత్యక్రియ ఖర్చులు రూ.30 వేలు, వివాహ బహుమతి రూ.30 వేలు, ప్రసూతి ఖర్చులు రూ.30 వేలు ఇలా పలు ప్రయోజనాలు కలుగుతాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.