అచ్చంపేట : దట్టమైన అడవితో నిండి ఉండే నల్లమల అడవులు ( Nallamala Forest ) శివనామ స్మరణతో మారుమోగాయి. మూడు రోజులపాటు కొనసాగే సలేశ్వరం లింగమయ్య జాతర ( Lingamayya Jatara ) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు వివిధ మార్గాల్లో ఆలయానికి చేరుకుంటున్నారు.
ముఖ్యంగా చైత్ర పౌర్ణమి(Chaitra Pournami) సందర్భంగా నిర్వహించే జాతరను కనులార చూసేందుకు అడవిగుండా ఓం లింగేశ్వరాయ నమ అంటూ శివనామ స్మరణ తో పాదయాత్ర చేస్తూ స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. అడవి దారులలో గుట్టలు, లోయలు లెక్కచేయకుండా కాలి నడకన స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. మన్ననూర్, ఫరహాబాద్, పుల్లాయపల్లి, రాంపూర్, మార్గాలుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. శనివారం చైత్ర పౌర్ణమి రోజున భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఎండను లెక్కచేయకుండా వస్తున్న భక్తుల కోసం అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలను స్థానికులు ఏర్పాటు చేశారు.
పోలీసుల భద్రత, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ నిర్వహణ కమిటీ, వాలంటీర్ల నిఘా మధ్య జాతర కొనసాగుతుంది. వాహనాల పెరగడంతో మన్ననూర్ చెక్‌పోస్ట్ , ఫరాహాబాద్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్నది. జాతరలో చెంచులు సంప్రదాయ పూజారులుగా వ్యవహరిస్తున్నారు. మరో మార్గమైన లింగాల, అప్పాయిపల్లి మీదుగా భక్తులు కాలినడకన స్వామి వారి సన్నిధికి చేరుకుంటున్నారు.ఈ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.
మొకాల కుర్వ వరకు వాహన ప్రయాణం..
ఫరహాబాద్, రాంపూర్ మీదుగా మొకాలకుర్వ వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి 8 కిలోమీటర్లు కాలినడకన ఎత్తైన గుట్టలు, రాళ్ల మధ్య అష్టకష్టాలు పడుతూ గాడిదదొనవాగు దాటి లింగమయ్య ఆలయానికి భక్తులు చేరుకుంటారు.
భక్తులకు ఆకలి తీరుస్తున్న అన్నదానకేంద్రాలు..
లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు మొకాలకుర్వ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు ఆకలితీరుస్తున్నాయి. నాగర్ కర్నూలుకు చెందిన శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 37 సంవత్సరాలుగా అన్నదానం కొనసాగిస్తున్నారు. జాతరకు తరలివచ్చే భక్తులకు మూడు పూటలు అన్నదానం వితరణ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. మరికొన్నిఅన్నదాన భక్తుల ఆకలిని తీరుస్తున్నాయి.
ఫరహాబాద్ వద్ద టోల్ ఛార్జీలు
సలేశ్వరం వెళ్లే వాహనాలకు ఫరాహాబాద్ వద్ద అటవిశాఖ టోల్‌చార్జీలు వసూలు చేస్తున్నారు. కారు, జీపు రూ.500, ట్రాక్టర్, ఆటో రూ.300, లారీ, బస్సు, డీసీఎం రూ.1000, ద్విచక్ర వాహనాలకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.