జ్యోతినగర్, నవంబర్ 5: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని టీఎస్టీపీపీ (తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు) ఫేజ్-2కు రంగం సిద్ధమైంది. రూ.29,344.85 కోట్ల అంచనా పెట్టుబడితో రెండో విడుత 2,400 మెగావాట్ల (800 చొప్పున మూడు యూనిట్లు) విద్యుదుత్పత్తికి మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్టీపీసీ కార్పొరేట్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం లభించింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్ ప్రక్రియను ప్రారంభించగా.. ఈ నెల 29న ప్రజాభిప్రాయ సేకరణకు తేదీ ఖరారు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం కేటాయించిన 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో టీఎస్టీపీపీ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టారు. మొదటి విడత 1,600 మెగావాట్ల (800 చొప్పున రెండు యూనిట్లు) ప్రాజెక్టును చేపట్టి ఉత్పత్తి దశలోకి తెచ్చారు. మిగతా దానికోసం ప్లాంట్ నిర్మాణం జరుగబోతోంది.