హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు (స్టేట్ వైల్డ్‌లైఫ్ బోర్డు) నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డు 8వ సమావేశం జరిగింది. అటవీ-జీవవైవిధ్య నిర్వహణను పెంచడానికి నిపుణులు చేసిన సిఫారసులను బోర్డు ఆమోదించింది. కవాల్ టైగర్ రిజర్వు బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ సెల్‌ఫోన్ టవర్ల అంశంలో ఐదు ప్రతిపాదనలపై ఎస్బీడబ్ల్యూఎల్ సమావేశంలో చర్చించారు. అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణాలను రక్షించే విధంగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. పోచారం వన్యప్రాణి అభయారణ్యం గుండా వెళుతున్న మెదక్-ఎల్లారెడ్డి రహదారి విస్తరణకు వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతిచ్చింది.
రక్షిత అటవీ ప్రాంతాల ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (వోఎఫ్సీ) లైన్లు వేయడానికి ఉన్న ప్రతిపాదనలపై చర్చించారు. నాగార్జునసాగర్ డివిజన్లోని పెద్దగట్టులో, ములుగులో 11కేవీ సబ్-స్టేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. మానవ-వన్యప్రాణుల సంఘర్షణ బాధితులకు పరిహారం చెల్లింపులను మీ-సేవా కేంద్రాల ద్వారా అందించడానికి కార్పస్ నిధిని రూపొందించాలని ప్రతిపాదించింది. టైగర్ రిజర్వులలోని గ్రామాల తరలింపులో భాగంగా కవాల్, అమ్రాబాద్ నుంచి 1,230 కుటుంబాలను నిర్దేశించిన ప్రాంతాలకు తరలించడంపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా జూలాజికల్ పారులు, జాతీయ ఉద్యానవనాలు, అర్బన్ పారులను పెంచడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఇప్పటికే ఉన్న సహజ వృక్షసంపదను కాపాడుతూ ..ఈ పారులలో స్థానిక జాతుల మొక్కలను నాటడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైల్డ్‌లైఫ్ బోర్డు సభ్యులు,ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు,రాందాస్‌నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, వైల్డ్‌లైఫ్ కన్జర్వేటర్ ఏలుసింగ్ మేరు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.