HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ) : హైడ్రా బాధిత కుటుంబాల్లో చీకటి అలుముకున్నది. సరిగ్గా సెప్టెంబర్ 8న గుట్టలబేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలలో ఏకంగా 60 కుటుంబాల జీవితాలు రోడ్డునపడ్డాయి. రెండు నెలలవుతున్నా ఆ కూల్చివేతల శిథిలాల మధ్యనే వారు నేటికి జీవనం వెళ్లదీస్తున్నారు.
రాత్రైతే చిమ్మచీకటి.. కళ్లు పొడుచుకుని చూసినా కనిపించని రహదారి.. ఎక్కడెవరు ఉన్నారో.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని దుర్భరపరిస్థితి.. బండిదీపాలు, సోలార్ దీపాలు, మంటల వెలుగుల్లో వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ట్రాన్స్కో వాళ్లను అడిగితే మీకు కరెంట్ ఇస్తే అక్కడి నుంచి ఖాళీ చేయరని అందుకే కరెంట్ ఇయ్యమని పంపించేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు కరెంట్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.