హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 19వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతా ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. మంగళ, బుధవారాల్లో అన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నదని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు పేర్కొన్నది. రాబోయే 48గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై గరిష్ఠంగా 33.5 డిగ్రీలు, కనిష్ఠంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని వెల్లడించింది. గడిచిన 24గంటల్లో జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు వివరించింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో అత్యధికంగా 3.3 సెం.మీ కురవగా, ఇటిక్యాలలో 1.7 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలాలో 3.1 సెం.మీ, చింతమానేపల్లిలో 1.8 సెం.మీ, మంచిర్యాల జిల్లా వేములపల్లిలో 2.8 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 1.8 సెం.మీ, కన్నాయిగూడెంలో 1.0 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో 1.7 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 1.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ; శ్రీశైలానికి 71,007 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
గద్వాల/అయిజ/ శ్రీశైలం, జూలై 14 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 30 వేల క్యూసెక్కులు, మొత్తం అవుట్ ఫ్లో 15,279 నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.790 టీఎంసీల నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండటంతో ఐదు క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేర ఎత్తి 18,199 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరాజ్‌కు 35,991 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. శ్రీశైలం జలాశయానికి సోమవారం 71,007 క్యూసెక్కుల వరద రాగా ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి 27,065 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలు ఉన్నాయి. జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 68,339 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.