పెద్దపల్లి : తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది కాళేశ్వరం ప్రాజెక్టేనని మరోమారు తేటతెల్లమైంది. కాళేశ్వరం లింక్ -2 కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు గురువారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని నంది పంప్ హౌస్ లో 2,3 మోటార్లను నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు నీటిని విడుదల చేశారు. ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీరు నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు.
రిజర్వాయర్ నుంచి అదే పరిమాణంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ కు జంట సొరంగాల ద్వారా జలాలు తరలి వెళ్తున్నాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు ఈ జలాల తరలింపు ఉంటుందని అధికారులు వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరదాకా మాత్రమే ఎత్తిపోతలు ఉంటాయని అధికారులు తెలిపారు.