TGSRTC | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ బస్టాండ్‌లో పురుడు పోసుకున్న చిన్నారికి జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందించనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలన్న యాజమాన్య గత నిర్ణయం మేరకు ఈ పాపకూ బర్త్‌డే గిఫ్ట్‌గా ఉచిత బస్‌పాస్‌ను మంజూరు చేస్తామని వెల్లడించింది.
కరీంనగర్ బస్‌స్టేషన్‌లో పురిటివొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరలు అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని యాజమాన్యం హైదరాబాద్ బస్‌భవన్‌లో బుధవారం ఘనంగా అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. ఆపద సమయంలో సేవా తర్పరతను చాటారని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.