హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ‘మా భూములు.. మాకేనని’ అహోరాత్రులు కొట్లాడుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు పెట్టే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారని, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్‌రెడ్డి గాయపడ్డారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదే అదునుగా భారతీయ న్యాయ సంహింత (బీఎన్ఎస్)లోని 118 (1) సెక్షన్లను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్లో 118 సెక్షన్ పెట్టినా దీని ద్వారా సెక్షన్ 118 (2) వర్తిస్తే.. ఆ సబ్ సెక్షన్ (2) ప్రకారం జీవిత ఖైదు, పదేండ్ల వరకూ పొడిగించే జైలు శిక్ష, రూ.20వేల వరకు జరిమానా విధించేలా సర్కారు పెద్దలు కుట్ర పన్నారని విద్యార్థులు మండిపడుతున్నారు.
సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఏదైనా పద్ధతిలో స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించే వ్యక్తికి జీవిత ఖైదు లేదా ఒక సంవత్సరం కంటే తకువ కాకుండా పదేండ్ల వరకు పొడిగించే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అని బీఎన్ఎస్లో స్పష్టంగా ఉంది. కాగా ఈ దారుణ సెక్షన్లు పెట్టిన ఇద్దరు విద్యార్థులు రోహిత్‌కుమార్, ఎర్రం నవీన్‌కుమార్‌ను కూకట్‌పల్లిలో జడ్జిముందు ప్రవేశపెట్టారు. తమ వారికి బెయిల్ వచ్చేలా కృషి చేయాలని హెచ్‌సీయూ విద్యార్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నారు. టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తాము ఇచ్చే ఫిర్యాదును తీసుకునేందుకు మాత్రం వెనుకాడారని, ప్రభుత్వ సెలవుల పేరు చెప్పి, ఫిర్యాదు తీసుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. తమ విద్యార్థులపై జీవిత ఖైదు సెక్షన్లు వర్తించేలా దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేంటని నిలదీస్తున్నారు. తాము ఏసీపీపై ఎలాంటి దాడి చేయలేదని చెప్తున్నారు.
ఈ 329 సెక్షన్ నేరపూరిత అతిక్రమణ గురించి చెప్తుంది. 329 (1)కింద కేసు బుక్ చేశారు. నేరం చేయాలనే ఉద్దేశంతో లేదా ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తిని బెదిరించడం, అవమానించడం లేదా బాధపెట్టడం లేదా చట్టబద్ధంగా అటువంటి ఆస్తిలోకి ప్రవేశించినా లేదా మరొకరి ఆధీనంలో ఉన్న ఆస్తిపైకి ప్రవేశించినా, ఆ వ్యక్తిని బెదిరించడం, అవమానించడం లేదా బాధపెట్టడం లేదా నేరం చేయాలనే ఉద్దేశంతో చట్టవిరుద్ధంగా అకడ ఉండిపోతే, నేరపూరిత అతిక్రమణగా పరిగణిస్తారు అని ఈ సెక్షన్ చెప్తున్నది. దీని కింద మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తారు.
బీఎన్ఎస్ సెక్షన్ 132 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి విధిని నిర్వహణకు ఆటంకం కలిగించడం, డ్యూటీ చేయకుండా అడ్డుకునేందుకు దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగం కిందకు వస్తుంది. ఈ సెక్షన్ కింద రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా, ఒక్కోసారి రెండూ ఉంటాయి. ఇక సెక్షన్ 191 అల్లర్లు గురించి చెప్తుంది. సెక్షన్ 191(1) ప్రకారం ఒక సమూహంలోని సభ్యులు అందరూ, లేదా కొందరు, బల ప్రయోగానికి దిగినట్టయితే దొమ్మీకి దిగినట్టుగా పరిగణిస్తారు. ఇందుకు రెండేండ్ల జైలు, జరిమానా.. ఒక్కోసారి రెండూ విధించే అవకాశముంది.
సెక్షన్ 351(3), ఆర్/డబ్ల్యూ 3 (5) గురించి అల్లర్ల సందర్భంలో మరణం సంభవించేలా గాయరపర్చడం, తీవ్రమైన గాయాలు కలిగించచేటట్టు చేయడం, ఆస్తిని తగలబెట్టటం, ధ్వంసం చేయడం, బెదిరించి భయోత్పాతం కలిగించడం వంటివి బీఎన్ఎస్లోని సెక్షన్ 351(3) పరిధిలోకి వస్తాయి. ఇలాంటి నేరాలకు మరణ శిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష, లేక ఏడేండ్ల కన్నా ఎక్కువ శిక్ష విధిస్తారు. ఏడేండ్ల వరకు జైలుశిక్ష, జరిమాన, లేక రెండూ విధింపవచ్చు. ఇక సెక్షన్ 3 (5) ప్రకారం ‘అనేకమంది కలిసి ఒకే లక్ష్యంతో ఒకే నేరపూరిత చర్యలో పాల్గొనడం. అటువంటి సందర్భంలో ఆ నేరమును ప్రతివ్యక్తి తనకు తానుగా చేసినట్టుగా పరిగణించి, ఆ నేరంలో పాల్గొన్నవారంతా శిక్షార్హులవుతారు’ అని ఈ సెక్షన్లలో ఉంది. ఇలా విద్యార్థులపై కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు.