హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషిని 18 ఏండ్ల శిక్ష పూర్తయ్యాక విడుదల చేయడం తప్పనిసరికాదని, అలాంటి ఖైదీలంతా క్షమాభిక్ష లభించే వరకూ జైల్లోనే ఉండాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
జీవిత ఖైదు పడిన తన తండ్రి ఎస్కే జకారియాను 18 ఏండ్ల శిక్ష పూర్తయిన తర్వాత కూడా విడుదల చేయకపోవడం అన్యాయమంటూ సనత్‌నగర్‌కు చెందిన రషీద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ అనుపమా చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు ఇచ్చింది. యావజ్జీవ ఖైదీని 18 శిక్ష పూర్తయ్యాక జైల్లో ఉంచడం అక్రమ నిర్బధం కిందకు రాదని, శిక్షను తగ్గిస్తూ (రెమిషన్) ఉత్తర్వులు వెలువడనంతవరకు అది సక్రమమేనని స్పష్టం చేసింది. క్షమాభిక్ష కోసం జకారియా చేసుకున్న వినతిపై గవర్నర్ నిర్ణయం తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశిస్తూ రషీద్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.