హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని కంపెనీలు, వ్యాపారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదులపై మంత్రి స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విత్తన డీలర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నీ కంపెనీలు ఒకే రకమైన బీజీ-2 విత్తనాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయని, కంపెనీల విత్తనాల్లో తేడా ఏమీ ఉండదని చెప్పారు. ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్ (450 గ్రా.) ధరను కేంద్రం రూ.853గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ధరకన్నా ఎక్కువకు అమ్మితే ఆ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారని పేర్కొన్నారు. ఇందుకు 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని, కానీ మారెట్లో 77,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.