నర్సంపేట, నవంబర్ 9: లంబాడా హక్కుల పోరాట సమితి బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ప్రకటించారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఫూల్సింగ్ మాట్లాడారు.
గత 26 ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసి లంబాడాల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్,బీజేపీ, టీడీపీ లంబాడాల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. తండాలను పంచాయతీలుగా గుర్తించాలని, లంబాడాలకు రిజర్వేషన్ కోసం డిమాండ్ చేసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 500 జనాభా కలిగిన ప్రతి తండాను పంచాయతీగా గుర్తించిన ఫలితంగా 3,146 మంది గిరిజనులకు సర్పంచ్‌లు అయ్యే అవకాశం ఏర్పడిందని అన్నారు. తండాలకు రోడ్లు నిర్మించారని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మూడో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మిగిలిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. నర్సంపేటలో తండాలను అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విజయానికి ఎల్‌హెచ్‌పీఎస్ ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు.