Runa Mafi | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రుణమాఫీకాని రైతులంతా తీవ్ర నిరాశలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటప్రకారం అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని.. రుణమాఫీకాని రైతుల సంఘం సోమవారం సీఎంకు లేఖ రాసింది. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాఫీ కాకపోవడం వల్లనే తాము లేఖ రాస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు.
రుణమాఫీ అవుతుందో లేదోననే ఆందోళనతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రెండు లక్షల కన్నా అధికంగా ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ అన్న నిబంధనతో రైతులు దికుతోచనిస్థితిలో ఉన్నారని, తక్షణమే ఆ నిబంధనలు ఎత్తివేయాలని కోరారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించారు.
‘గౌరవ నీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి..
మేమంతా రాష్ట్రంలో రుణమాఫీకాని రైతులం. మాకు వివిధ బ్యాంకు ఖాతాలో రెండు లక్షలకు పైగా వ్యవసాయ రుణాలు కలవు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటివరకు రెండు లక్షలలోపు రైతులకే మాఫీ చేసింది. రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియక వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు.
కొంత మంది తీవ్ర నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకొకరి కుటుంబంలో నాలుగైదు లక్షలకుపైగా ఉన్నందున పైన ఉన్న డబ్బులు కడితేనే మాఫీ అవుతుందని చెప్పేసరికి దికుతోచనిస్థితిలో రైతులు ఉన్నారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని మీకు విన్నవించుకుంటున్నాం. మా యందు దయతలచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.’ అని రెండు లక్షల పైనా అప్పు ఉండి రుణమాఫీ కానీ బాధిత రైతులు పేర్కొన్నారు.ఈ లేఖ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.