హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి అవసరమైన ఎరువుల సరఫరాలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని, ఇది రైతుల అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆక్షేపించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని సాకుగా చూపడం దారుణమన్నారు. రాష్ర్టానికి అవసరమైన ఎరువులను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కేంద్ర ఎరువులు, రసాయనశాఖకు లేఖ రాశారు. వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల సేకరణపై అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులతో హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వానకాలంలో 24.45 లక్షల టన్నుల ఎరువులు అవసరమని తెలిపారు. మే నెలాఖరుకు 5 లక్షల టన్నుల యూరి యా, జూన్ 15 వరకు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేలో అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు కలిసి రైతులకు ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వానకాలం సీజన్‌కు అవసరమయ్యే ఎరువులు
యూరియా : 10.50 లక్షల టన్నులు
కాంప్లెక్స్ ఎరువులు : 9.4 లక్షల టన్నులు
డీఏపీ : 2.3 లక్షల టన్నులు
ఎంవోపీ, ఎస్ఎస్పీ : 2.25 లక్షల టన్నులు
మొత్తం : 24.45 లక్షల టన్నులు