Formula E | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఫార్ములా ఈ- రేస్ కేసు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వం సంయమనం పాటించి చర్యలు తీసుకోవాలని అమెరికాకు చెందిన కాంగ్రెస్ పార్టీ స్నేహితులు హితవుపలికారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీనియర్ మంత్రులు భట్టి విక్రమార, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ పేరుతో రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రేస్ వ్యవహారంలో విచారణ కీలకమైనదని, కానీ, మాజీ ఐటీ మంత్రిని కేవలం సంచలనం సృష్టించడానికే అరెస్టు చేయడం, తొందరపాటు చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదకర ఫలితాలు రావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేసిన తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
చెడు ప్రభావాలు ఇలా..
ఈ కేసులో సంబంధిత విదేశీ కంపెనీపై ఎలాంటి కేసు లేదని, అవినీతి ఆరోపణల కారణంగా, న్యాయస్థానం ఆ కంపెనీని కేసులో పార్టీగా చేర్చాలని ఆదేశిస్తే విదేశీ పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా, శాఖపరంగా అవమానానికి గురవుతారని, ఇది భవిష్యత్తు ప్రభుత్వాలకు చెడు సందేశం పంపుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల అరెస్టు, జైలులో నిర్బంధించడం వంటి చర్యలు రాజకీయ కక్షసాధింపుగా ప్రజలు భావించవచ్చని, ఢిల్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతిష్టపై ఇది ప్రభావం చూపవచ్చని తెలిపారు.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని సూచించారు. ఈ కేసు నిర్వహణలో పొరపాట్లు జరిగితే ఐటీ, పరిశ్రమలశాఖపై చెడు ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏ చర్యలైనా తీసుకొనే ముందు సరైన విచారణ జరిపి, అవినీతి లేదా క్విడ్ ప్రోకో జరిగిందా? లేదా? అని నిర్ధారించుకొన్న తర్వాతనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సీనియర్ మంత్రులు, ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తిచేశారు.