హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. అలుపెరగని పోరాటంతో తెలంగాణను సాధించి పదేండ్ల పాలనలో అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపిన కేసీఆర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నాయకులు తోచిన మేరకు అన్నార్థులకు సాయం చేయాలని కోరారు. వాడవాడలా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. రక్తదానం చేసేందుకు కార్యకర్తలు ముందుకురావాలని కోరారు. దవాఖానల్లో రోగులకు, బస్తీల్లో పేదలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయాలని సూచించారు. వాడవాడలా అన్నదాన కార్యక్రమాలు చేయాలని, నిరుపేదలకు నిత్యావసరాలు అందజేయాలని కోరారు. గులాబీ సైనికులు ఊరూరా, వాడవాడలా విరివిగా మొక్కలు నాటి హరిత ప్రేమికుడికి అకుపచ్చని కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు, నిస్సహాయులకు ఇతోధికంగా సాయమందించాలని విజ్ఞప్తి చేశారు.