హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించ తలపెట్టిన 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిని రద్దు చేసేవరకు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిరసనల మధ్యే ఈ పోటీలు జరుగుతున్నాయని, 1996లో బెంగళూరులో ఈ పోటీలను నిర్వహించినప్పుడు కూడా నిరసనలు హోరెత్తాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే పోటీలు పర్యాటకంగా తెలంగాణను ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదం చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడంపై ఆమె మండిపడ్డారు. మహిళలను అవమానిస్తూ సామ్రాజ్యవాదులకు ప్రయోజనం చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాద్‌ను వేదికగా మార్చాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న పాలకులు యువతుల అందాల పోటీలకు అనుమతి ఇవ్వడం విషాదకరమని, ఆ పోటీలను ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవిగా రాష్ట్ర ప్రభుత్వం భావించడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను, సమస్యలను, ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశ, విదేశీ యువతుల అందాల ఆరబోతను చూసి జనమంతా తరించాలని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని సంధ్య విమర్శించారు.