మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వరంగల్ సభ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించి, గోడపై అంటించడంతోపాటు సభకు తరలిరావాలని వాల్ పెయింటింగ్ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను పండుగలా నిర్వహించనున్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక చరిత్రలో నిచిపోయేలా కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు.
మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకుడు అంబదాస్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీ ప్రస్తుతం ప్రజల పక్షాన పోరాటం చేస్తుండడంతో ఆకర్షితులై చేరినట్టు అంబదాస్ ప్రకటించారు.