రంగారెడ్డి : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నారు. పశువుల మందలపై వరుస దాడులకు పాల్పడుతూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో వరుస దాడులకు పాల్పడుతూ గత కొన్ని నెలలుగా ఓ చిరుత గ్రామస్తులను వణికిస్తుంది. గ్రామ శివారులో ఉన్న మేకల మందలపై, పశులపాకలపై వరుసగా దాడులకు పాల్పడుతూ అటు రైతులకు ఇటు ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నది.
ఇటీవలే గ్రామానికి చెందిన బికని అంజయ్య పశులపాకలపై దాడి చేసి రెండు దూడలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా అదే గ్రామానికి చెందిన దొడ్డి యాదయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై సోమవారం రాత్రి దాడి చేసి ఆవును చంపుకు తిన్నది. ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు చిరుత దాడికి పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
చిరుత ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ చిరుత చిక్కక పోవడంతో అధికారులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించి రైతులను, మూగజీవాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.