Leopard Died | మెదక్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై చిరుతపులి మరణించింది. నార్సింగి మండలం వల్లూరు వద్ద చిరుత మృతి చెందింది. రహదారిపై నడుచుకుంటూ వస్తున్న చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే చనిపోయినట్లుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చిందని.. మృతి చెందింది మగ చిరుత అని.. దాని వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో రహదారిపైకి వచ్చిన సమయంలో.. అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టడంతో చిరుత తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలుస్తున్నది. చిరుత మృతి సమాచారం అందుకున్న చైతన్య కుమార్ రెడ్డి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత చిరుతను వాహనంలో వల్లూరు అటవీ ప్రాంతంలోకి తరలించారు. చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.