హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో నిమ్మకాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చుకలు చూపిస్తున్నాయి. వాటిని కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. మూడు వారా ల క్రితం వరకు కిలో రూ.50 ధర పలికిన నిమ్మకాయలు.. ప్రస్తుతం మారెట్లో ఒకసారిగా రూ.200 నుంచి రూ.240 వరకు చేరింది. మార్కెట్లలో తీవ్రమైన కొరత ఏర్పడి ధరలు మరింతగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వేసవిలో ఎండల తీవ్రత పెరుగడంతో ప్రజలు శీతల పానీయాలు, ముఖ్యంగా నిమ్మరసం వైపు మొగ్గుచూపుతుండటంతో వాటికి మరింత డిమాండ్ పెరిగింది.
అకాల వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి నిమ్మ తోటల్లో దిగుబడి గణనీయంగా పడిపోయింది. గతంలో ఒక ఎకరాకు సగటున 40 బస్తాల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అది 15 బస్తాలకు కూడా చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పూత దశలో వాతావరణం అనుకూలించక, తెగుళ్ల ప్రభావంతో కాయ సైజు తగ్గి, నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. ధరలు పెరిగినా రైతులకు మాత్రం ఆశించిన లాభాలు అందడం లేదు. మారెట్లో అధిక ధర ఉన్నా, విక్రయించడానికి సరిపడా సరుకు లేక సాగు ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు, కిలో రూ.200కు పైగా ధర పలుకడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిమ్మకాయలు కొనాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా హోటళ్లు, జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు కూడా పెరిగిన ధరల వల్ల ఇబ్బందులు ఎదురొంటున్నారు. ఏప్రిల్లోనే ఈ స్థాయి ధరలుంటే, మే నెలలో నిమ్మ ధరలు కిలో రూ.250 దాటవచ్చని మారెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిమ్మ తోటలు సాగయిన ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి నిమ్మకాయలను దిగుమతి చేసుకొనే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
గత పదేండ్లలో ఇంత ధర ఎన్నడూ లేదని, ఇదే రికార్డ్ స్థాయి ధర అని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. ఢిల్లీ మారెట్, ఈశాన్య ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి అకడ ఒక నిమ్మకాయ రూ.5 వరకు ధర పలుకగా, తెలంగాణలోని హైదరాబాద్ ఇతర రిటైల్ మార్కెట్లలో ఒక నిమ్మకాయ ధర రూ.10 పలుకుతున్నది. హైదరాబాద్లోని ప్రముఖ నిమ్మకాయల మార్కెట్ దారుల్షిఫా హోల్సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.4,500 వరకు విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,800 నుంచి రూ.2,500 వరకు అమ్ముడవుతున్నాయి.
సూర్యాపేట జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల, కట్టంగూర్, గుర్రంపోడు, పెద్దవూర వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి నిమ్మకాయలు దిగుమతి అవుతుంటాయి. కానీ మార్చి నెల నుంచే సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 25 కిలోల తూకం ఉన్నవి 1,200 నుంచి 1,500 బస్తాలు గతంలో రాగా, ఇప్పుడు కేవలం 800 నుంచి 1,000 బస్తాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.