హైదరాబాద్,ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యువ షూటర్ లీషా కిరణ్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానం సాధించింది. 25, 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో ఐదు గోల్డ్ మెడల్స్‌తో అదరగొట్టి టోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన షూటర్‌గా నిలిచింది. గచ్చిబౌలిలోని శాట్ షూటింగ్ రేజ్‌లో శనివారం ముగిసిన ఈ పోటీల్లో లీషా మహిళల 25 మీటర్ల పిస్టల్ సీనియర్, జూనియర్ కేటగిరీతో పాటు జూనియర్ స్టాండర్డ్ పిస్టల్, యూత్ స్పోర్ట్స్ పిస్టల్ విభాగాల్లో లీషా స్వర్ణాలు సాధించింది. 50 మీటర్ల మహిళల కేటగిరీలోనూ పసిడి సొంతం చేసుకుంది. మాజీ డీజీపీ అంజనీ కుమార్ 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ సీనియర్ మాస్టర్స్ విభాగంలో స్వర్ణ పతకం, స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో రజతం గెలిచారు. విజేతలకు తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘి మెడల్స్ అందజేశారు.