Gutha Sukhender Reddy | నల్లగొండ : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలి అని సూచించారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరం అవుతాయి అనే నమ్మకం కలిగిందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలవడాన్ని అభివృద్ధి కోణంలో చూడాలి. అందులో రాజకీయ కోణం చూడవద్దు. ప్రతిపక్ష పార్టీలు చేసే బెదిరింపులకు అసలు భయపడవద్దు.. అప్పుడే అభివృద్ధి పనులు చేసుకోగలుగుతం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకోవడం తప్ప మినహా మరో మార్గం లేదు. కృష్ణా జలాల విషయంలో న్యాయబద్ధంగా తెలంగాణకు వాటా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ పెండింగ్ పనులు పూర్తి చేస్తే జిల్లాలో సాగునీటి సమస్యలు తీరుతాయని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
శాసన మండలి రద్దు అనేది అసంబద్దమైనది. అలాంటి పరిస్థితి ఏం లేదు. 2026లో పునర్విభజన చట్టం అమలయ్యే అవకాశం ఉంది. ఈ చట్టం అమలైతే తెలంగాణలో 34, ఏపీలో 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. రైతు బంధు, రైతు భరోసా కేవలం పది ఎకరాల వరకు ఇస్తే చాలు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. రైతు భరోసా, రైతు రుణమాఫీ అర్హులైన వారికే ఇవ్వాలి. శాసన మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడను. పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో ఉన్న శాసన మండలి ఛైర్మన్, స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మేము కూడా అలాగే తీసుకుంటాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చాలా కష్టపడుతున్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయని అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం మంచిదే అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.