హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : హై షుగర్ ఉన్న ఫేక్ ఓఆర్ఎస్ విక్రయాలకు వ్యతిరేకంగా పోరాడి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు ఇచ్చాయి. చక్కెర శాతం అధికంగా ఉన్న ఓఆర్ఎస్ను ఆకర్షణీయమైన టెట్రా ప్యాకెట్లలో అమ్ముతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆమె కొంత కాలంగా పోరాడుతున్నారు. ఈ ఓఆర్ఎస్ కారణంగా చిన్నారులు, డయాబెటిక్ పేషెంట్లు మరింత రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు.
ఈ ఫేక్ ఓఆర్ఎస్ వల్ల కలిగే నష్టాలను ఆమె శాస్త్రీయమైన ఆధారాలతో వెలుగులోకి తెచ్చారు. దీంతో ఓఆర్ఎస్ పేరిట బ్రాండ్ల విక్రయాన్ని నిలిపివేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలు ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఆమెకు లీగల్ నోటీసులు జారీచేశాయి. నోటీసులు ఇవ్వడం సరికాదని పలు వైద్య సంఘాలు మండిపడ్డాయి. నోటీసులను వెనక్కి తీసుకోవాలని వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి.