హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామానికి గురువారం వామపక్షాల నిజనిర్ధారణ కమిటీ వెళ్లనున్నది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు ఈ బృందం బయలుదేరి వెళ్లనున్నది. వామపక్షాలకు చెందిన అన్ని పార్టీల రాష్ట్ర నేతలు ఈ కమిటీలో ఉంటారు. సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, రమ, సీపీఐ నుంచి బాలమల్లేశ్, న్యూడెమోక్రసీ నుంచి కే గోవర్ధన్, ఎంసీపీఐ నుంచి వనం సుధాకర్, రవి తదితరులు పాల్గొంటారని వామపక్ష నేతలు తెలిపారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య అనుసంధానకర్తగా ఈ కమిటీ వ్యవహరించనున్నదని పేర్కొన్నారు. పోలీసులు అనుమతిస్తే లగచర్లకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని నిజనిర్ధారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నదని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని వారు వెల్లడించారు.
లంబాడీ నేతల నిర్బంధమే ప్రజాపాలనా? ; ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి నిర్బంధ పాలన సాగిస్తున్నారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్రఅధ్యక్షుడు రాంబల్ నాయక్ ఆరోపించారు. లగచర్ల భూ బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్న గిరిజన నాయకులను అరెస్ట్ చేయడం రేవంత్‌రెడ్డి అవివేకమని మండిపడ్డారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన చలో లగచర్ల కార్యక్రమానికి బయలుదేరిన నేతలను రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా లగచర్ల బాధితుల తరఫున పోరాటాలు చేస్తూ ఉంటామని స్పష్టం చేశారు. లగచర్ల భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. అరెస్టయిన వారిలో లక్ష్మణ్‌నాయక్, చందు, లిబియానాయక్, ఏకనాథ్, రాజు, అయోధ్య శ్రీనివాస్, జగన్, మోహన్, బాబు, రాజేందర్, అంబదాస్, భోజ్యానాయక్ తదితరులు ఉన్నారు.