హైదరాబాద్, జులై 6 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా కల్పిస్తాం, కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం’ అంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించిన హస్తం పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీల అమలుపై ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయిందని దివ్యాంగులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5.4 లక్షల మంది దివ్యాంగులను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శిస్తున్నారు.
కొత్తగా ఇచ్చే పథకాల సంగతి పక్కనపెడితే బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలకు సైతం రేవంత్‌రెడ్డి సర్కార్ ఎగనామం పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సహాయ పరికరాల కోసం కూడా దివ్యాంగులు పోరాటం చేయాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్న ప్రభుత్వం దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్న హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దివ్యాంగుల పోరాట సమితితో కలిసి ఆందోళనకు సిద్ధమైనట్టు జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక (ఎన్పీఆర్డీ) ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంఘాల నేతలు డిమాండ్లు, ఉద్యమ కార్యాచరణపై తీర్మానాలు చేశారు.
హామీలను ఎగ్గొడితే తగిన బుద్ధి చెప్తాం
దివ్యాంగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎన్నికలకు ముందు అధికారం కోసం హామీలిచ్చింది. గద్దెనెక్కి 600 రోజులవుతున్నా అమలుపై దృష్టి పెట్టడంలేదు. ముఖ్యంగా పింఛన్ పెంపును పట్టించుకోవడంలేదు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా సత్వరమే స్పందించాలి. లేదంటే ప్రభుత్వంపై ఉద్యమం చేసి, తగిన బుద్ధి చెప్తాం.
-కే వెంకట్, జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
దివ్యాంగుల డిమాండ్లు
దివ్యాంగుల ఉద్యమ కార్యాచరణ