హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండే నడుస్తున్నది. ఉదయం మార్నింగ్ వాక్ నుంచి రాత్రి ఇంటికి చేరంత వరకు నిత్యం ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నది. ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ కావటంతో సాధారణ జనాల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అందరూ సామాజిక మాధ్యమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నా రు. చాలామంది లీడర్లు సోషల్‌మీడియాలో తమ ఉనికిని చాటుకొనేందుకు నిపుణులను నియమించుకున్నారు.
ఇట్లాంటివారి కోసం నగరంలో డిజిటల్ మీడియా ప్రమోషన్ చేసే కన్సల్టెన్సీలు, ఏజెన్సీలతోపాటు కొన్ని పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు ఆరు నెలల ముందు నుంచే పాగా వేసి, క్రమంగా కార్యకలాపాల ను విస్తరిస్తున్నాయి. అయితే సోషల్ మీడి యా నిర్వహణ ఖర్చులు పొలిటికల్ లీడర్లకు తడిసి మోపెడవుతుందని సమాచారం.
భారీ మొత్తంలో ఉండే ప్యాకేజీలతోపాటు సిబ్బందికి లాడ్జింగ్, బోర్డింగ్ సదుపాయాలు, ఫుడ్ అలవెన్స్‌ల పేరిట భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని లీడర్లు వాపోతున్నారు. పొలిటికల్ లీడర్లకు ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగిన ఏజెన్సీలు నగరంలోని పలు నియోజకవర్గాల పరిధిలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. స్థానికంగా ఉండే సోషల్ మీడియా సభ్యులతోపాటు, మరికొంత మంది నిపుణులతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కార్యాకలాపాలు కొనసాగిస్తున్నాయి. అభ్యర్థికి సంబంధించిన రోజువారీ షెడ్యూల్‌తోపాటు, ఆయా పార్టీల కార్యకలాపాలు, హామీలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలైతే అభ్యర్థులకు టికెట్ ఇచ్చేందుకు సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్లు ఉండాలనే నిబంధన కూడా పెట్టినట్టు తెలిసింది. ఇది కూడా డిజిటల్ మీడియా ప్రమోటర్ల ప్రభావమేనని నేతలు భావిస్తున్నారు. దీంతో అనివార్యంగా మారిన సోషల్ మీడియాను తమ ప్రచారాస్ర్తాల్లో భాగంగా చేసుకోవాల్సి వస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించిన ఏజెన్సీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10-12 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని సమాచారం.