హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్మోడ్ పాలనతో తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగిపోయాయని, వ్యవసాయం పండుగలా మారిందని, అదే పాలన తమకూ కావాలని మహారాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్లో ప్రముఖ షెతరీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ పాటిల్ చేరిన విషయం తెలిసిందే. బుధవారం రఘునాథ్ పాటిల్ ఆధ్వర్యంలో ఇస్లాంపూర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షేతరీ సంఘటన్ నేతలు కార్యకర్తలు సహా పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోంగ్డే తదితర హాజరయ్యారు.
ఇస్లాంపూర్ బహిరంగ సభలో బీఆర్ఎస్లో పెద్దఎత్తున నాయకులు చేరారు. వంశీధర్‌రావు పార్టీలోని చేరినవారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రూ.5 లక్షల రైతుబీమా పథకాల అమలుతో రైతులంతా సంతోషంగా పంటల సాగుచేస్తున్నారని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసి మొదటి స్థానంలో నిలిచిందని షెతరీ సంఘటన్ నేతలు కొనియాడారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలన అన్ని వర్గాలకు అండగా ఉంటున్నదని, అన్ని వర్గాలకు సమన్యాయంతో సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మహారాష్ట్ర రైతులు సన్మానించాలని నిర్ణయించారు. రైతుల ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నది. అనివార్యకారణ వల్ల హాజరు కాలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిధిగా మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావును ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన మహారాష్ట్రలో కూడా కావాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు తెలిపారు.