హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : విభజన హామీల అమలు బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంపు కార్యాలయంలో యర్రగొండపాలెం, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన దూపాటి చంద్రబాబు, డాక్టర్ వెస్లీ సహా పలు జిల్లాల నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి చంద్రశేఖర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిపోయిందని చెప్పారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం సహా విభజన హామీలు సాధనలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలు సాగిలపడి ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని మండిపడ్డారు. బీజేపీని ఎదిరించే సత్తా ఒక్క బీఆర్ఎస్కే ఉందని స్పష్టంచేశారు. దేశ ప్రజలందరూ తెలంగాణ మాడల్ అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు.